లోకేశ్‌ను కలవలేదని చెబుతూనే కలిస్తే తప్పేమిటని కేటీఆర్ అంటున్నారు: సంపత్ కుమార్

లోకేశ్‌ను కలవలేదని చెబుతూనే కలిస్తే తప్పేమిటని కేటీఆర్ అంటున్నారు: సంపత్ కుమార్

కేటీఆర్ మాటలు రోజురోజుకు శృతి మించుతున్నాయన్న కాంగ్రెస్ నేత

కేటీఆర్ పుస్తకంలో ఒక పుటను మాత్రమే చదివామని వ్యాఖ్య

సమయం వచ్చినప్పుడు మిగిలిన పుస్తకాలను బయటపెడతామని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను కలవలేదని చెబుతూనే, మరోవైపు కలిస్తే తప్పేమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కేటీఆర్ మాటలు రోజురోజుకు శృతి మించుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ కంటే ఎక్కువ మాట్లాడగలనని అన్నారు.

“కేటీఆర్, నీ పుస్తకంలో ఇప్పటి వరకు ఒక పుటను మాత్రమే చదివాం. ఇంకా చాలా కథ ఉంది. ‘రావుగారి రాసలీలలు’, ‘కల్వకుంట్ల కథాకమిస్ట్’, ‘తారక్ తోడేలు’ అనే మూడు పుస్తకాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకాలను బయటపెడతాం” అని హెచ్చరించారు. కేటీఆర్ కంటే ఎక్కువ భాష మాట్లాడగలనని, అలా మాట్లాడితే తట్టుకోలేవని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలని అన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని కొల్లాపూర్ ప్రజలు కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి మరో పది, పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అదే మాటలను రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన వెల్లడించారు. జనం కోరుకుంటున్న దానినే ముఖ్యమంత్రి తన వ్యాఖ్యల ద్వారా చెప్పారని అన్నారు.

Leave a Comment