రీపోలింగ్ కోరి.. ఇప్పుడు బహిష్కరించడమేంటి?: బీటెక్ రవి ఫైర్
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో అనూహ్య పరిణామం
రెండు బూత్‌లలో రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ ఆరోపణ
రీపోలింగ్ అడిగింది వాళ్లే, పారిపోయేది వాళ్లేనంటూ బీటెక్ రవి విమర్శ
రాజారెడ్డి రాజ్యాంగం వద్దని ప్రజలు తీర్పిచ్చారని టీడీపీ నేతల వ్యాఖ్య
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఉపఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించిన రెండు బూత్‌ల రీపోలింగ్‌ను బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. “మొదట 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పుడు ఎన్నికల సంఘం రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే, దానిని బహిష్కరిస్తున్నామని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంటే ఈ రెండు బూత్‌లలో రీపోలింగ్ ను ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు మీకు ఓటు వేయరని, మీరు ఓడిపోతారని స్పష్టంగా తెలియడం వల్లే ఈ బాయ్‌కాట్ డ్రామా ఆడుతున్నారు” అని బీటెక్ రవి ఆరోపించారు.
ఈ రెండు బూత్‌లలో ఎన్నికలు జరిగితే ఎలాగూ మళ్లీ రీపోలింగ్ రాదని, అలాంటప్పుడు పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ వైపు లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వైఎస్సార్సీపీ ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఇదే విషయంపై ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతూ, ఇది వైఎస్సార్సీపీ ఆడుతున్న “డైవర్షన్ పాలిటిక్స్” అని ఆరోపించారు. పోలింగ్ రోజు సాయంత్రం ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత తమకు ఓట్లు పడలేదని నిర్ధారించుకుని, కావాలనే రీపోలింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఇప్పుడు తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘం, పోలీసులు, టీడీపీపై నెపం మోపుతున్నారని, రేపు మీడియాపైనా ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు.
“గతంలో ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కానీ ఇప్పుడు ప్రజలు ఆ పాలన వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి లతారెడ్డికి ఓటు వేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు” అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ, ఈసీ ఆదేశాల మేరకు రెండు బూత్‌లలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
