విజయవాడలో వర్ష బీభత్సం.. ఇద్దరు మృతి
భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణానది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో..
కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక
సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయవాడలో ఇద్దరు మృతి
విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఓ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్హాల్లో పడి చనిపోయాడు. మృతుడ్ని 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడ మధుసూదన్గా గుర్తించారు. రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. భారీ వర్షాల కారణంగా చెట్టు కూలిపోయింది. అటువైపు వచ్చిన ఆ వ్యక్తిని చెట్టును ఢీకొన్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన లయోలా కాలేజీ దగ్గర జరిగింది.
విజయవాడకు వరద ముప్పు
విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇక, భారీ వర్షాల కారణంగా అచ్చంపేట-మాదిపాడు రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
