తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి నిత్య అసంతృప్తి వాదిగా మారారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకా చాలా చూడాల్సి ఉంటుందని ఆయన శాంపిల్స్ చూపిస్తున్నారు. రోజు రోజుకు వాటి డోస్ పెంచుతున్నారు. నిధులు కూడా ఇవ్వడం లేదంటున్నారు. అలా రోజూ ఆయన మాట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. కనీసం హైకమాండ్ ప్రతినిధులు అయినా పట్టించుకుని… క్రమశిక్షణను గుర్తు చేయాలి కదా అన్న డౌట్ చాలా మందికి వస్తోంది. కానీ ఎవరూ గుర్తు చేయడం లేదు.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్ట్ అని.. క్రమశిక్షణ ఉల్లంఘనను ఏ మాత్రం సహించరని చెప్పుకున్నారు. కానీ ఆమె కూడా మాట్లాడటం లేదు. పార్టీ వ్యవహారాల కన్నా.. తన అనుచరులతో సమావేశాలకే రాజగోపాల్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన ఉద్దేశం మంత్రి పదవి మాత్రమే. అది సాధ్యం కాదని హైకమాండ్ తేల్చేసినప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయనను కంట్రోల్ లో ఉండేలా హెచ్చరికలు జారీ చేయాల్సింది కూడా హైకమాండే. కానీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవు.
రోజు రోజుకు రాజగోపాల్ రెడ్డి తన స్వరం పెంచుతున్నారు. ఇలా బెదిరిస్తే ఆయనకు మంత్రి పదవి వస్తుందో రాదో చెప్పడం కష్టం కానీ.. ఆయన మాత్రం పార్టీకి నష్టం చేస్తున్నారు. పార్టీ పట్ల ఎప్పుడూ ఆయనకు సానుకూల భావనలేదు. తనకు పదవులు వస్తే సరి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఉందని ప్రశ్నించే తత్వం ఆయనది. అలాంటి అవకాశవాద లీడర్ .. సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తున్నా.. హైకమాండ్ చర్యలు తీసుకోవాలని అనుకోకపోవడంపై కాంగ్రెస్ నేతల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఆయనపై ఎవరూ స్పందించవద్దని సంకేతాలు పార్టీ నుంచి ఉన్నాయి.
పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇంకా దృష్టి సారించలేదని అంటున్నారు. ఆయనపై ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు. కానీ హైకమాండ్ నుంచి సిగ్నల్ వస్తేనే ఏదైనా చేయగలరు. లేకపోతే ఆయన ఎటాక్ అలా రేవంత్ పై కొనసాగిస్తూనే ఉంటారు. దాని వల్ల లాభపడేది ఎవరు.. నష్టపోయేది ఎవరు?
