ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా చట్టం తెచ్చారు: కేంద్రంపై రాహుల్ ఫైర్

ఈసీపై చర్యలకు అవకాశం లేకుండా 2023లో కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చిందన్న రాహుల్ గాంధీ

మోదీ – షాలకు ఈసీ సాయం చేస్తోందని ఆరోపణ

‘‘ఒక వ్యక్తి – ఒక ఓటు’’ సూత్రాన్ని కాపాడడం కోసమే తమ పోరాటమని వ్యాఖ్య

ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలులేకుండా కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకువచ్చిందని; ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఈసీ సాయం చేయడం వల్లే ఇలా చట్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాల ఆరోపణల పట్ల ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన ఆరోపణలు చేశారు. బిహార్‌లో ఓట్ల చోరీకి ఇది ఒక మార్గం కావచ్చని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎన్నికల సంఘం సహాయం చేస్తోందని విమర్శించారు. బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ తొలిరోజు ముగింపు సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసిందన్నారు.

2023లో కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చింది. దాంతో, ఎన్నికల కమిషనర్లపై కేసులు పెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే మోదీ, షాలకు ఈసీ సహకరిస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చిందని ఆయన ప్రశ్నించారు. ‘‘ఒక వ్యక్తి – ఒక ఓటు’’ సూత్రాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈసీకి ఎలాంటి పక్షపాతాలు లేవు. అన్ని పార్టీలను సమానంగా చూస్తాం. ఓట్ల చోరీ అని అనవసర అనుమానాలు లేవనెత్తడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ సంస్థలను అవమానించకూడదు. రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా దీనిపై అఫిడవిట్ సమర్పించాలి. లేనిపక్షంలో ఆయన ఆరోపణలను నిరాధారమైనవిగా పరిగణిస్తాం” అని స్పష్టం చేశారు.

Leave a Comment