యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన యూరియా కొరతకు తెరపడిందని చెప్పవచ్చు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోనున్నట్లు వ్యవయసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు పేర్కొన్నారు.

పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం యూరియాను సరఫరా చేసిందని పేర్కొన్నారు. యూరియా కొరతతో కొంతమంది రాజకీయలు చేశారని మండిపడ్డారు. యూరియాను త్వరలోనే అన్ని జిల్లాలకు సరఫరా చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

అలాగే మంత్రి తుమ్మల వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రానికి నిర్దిష్టమైన లెక్కలతో పంట నష్టం వివరాలు అందించాలని ఆదేశించారు. బృందాలుగా ఏర్పడి జిల్లాలలో పర్యటించి, పంట నష్టం వివరాలను సేకరించాలని సూచించారు. అనంతరం వరద బాధిత ప్రాంతాల కలెక్టర్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం వరదల పంట నష్టంపై సమావేశం నిర్వహిస్తారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు..

Leave a Comment