జిల్లాలో స్త్రీ శక్తి పథకం అమలుకు సర్వం సిద్ధంరేపటి (శుక్రవారం) నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం
జిల్లాలో 492 బస్సుల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ అధికారులుముస్తాబైన ఆర్టీసీ డిపోలు- నెల్లూరులో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి నారాయణరాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి జిల్లాలో సర్వం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విజయవాడ నుంచి సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 492 బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఆధార్‌కార్డు, ఓటరుకార్డు మరి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడినుండి ఎక్కడికైనా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సులతో పాటు అద్దెబస్సులను కూడా ఏర్పాటుచేశారు. జిల్లాలోని ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కలిపి 61 బస్సులు, కందుకూరు డిపో పరిధిలో 60, కావలిలో 90, నెల్లూరు1
2 డిపో పరిధిలో 90, రాపూరు డిపో పరిధిలో 49, ఉదయగిరి డిపో పరిధిలో 51 బస్సులను మహిళల ప్రయాణానికి సిద్ధం చేశారు. మొత్తం 492 బస్సులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మహిళల ఉచిత ప్రయాణానికి సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి షామీమ్ తెలిపారు. ఈ బస్సుల్లో చార్జీ రాయితీ మొత్తం చూపిస్తూ జీరో ఫేర్ టిక్కెట్లను జారీ చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు ఆమె చెప్పారు. బస్సుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది, ప్రయాణికుల మధ్య పరస్పర దాడులు జరగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. బస్సుల్లో నిఘా, పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
మహిళలకు ఉచిత పథకాన్ని నెల్లూరు ప్రధాన బస్ స్టేషన్‌లో ఆగస్ట్ 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఏ.పి.యస్.ఆర్.టి.సి. నెల్లూరు జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సమక్షంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి షామీమ్ తెలిపారు. అన్ని డిపోల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
.