రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్ రెడ్డి
పులివెందులలో రెండు బూత్ లలో రీపోలింగ్
అన్ని బూత్ లలో అవకతవకలు జరిగాయన్న అవినాశ్
కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు బూత్ లలో ఉప ఎన్నిక జరుగుతోంది. నిన్న జరిగిన పోలింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఫిర్యాదు చేయడంలో రెండు బూత్ లలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రీపోలింగ్ ను తాము బహిష్కరిస్తున్నామని అవినాశ్ తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ లలో అవకతవకలు జరిగిన విషయాన్ని నిన్న రాష్ట్ర ప్రజలందరూ చూశారని… కానీ రెండు బూత్ లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. కంటితుడుపు చర్యగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. పులివెందులలో సరికొత్త సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రీపోలింగ్ అనేది ఒక డ్రామా అని విమర్శించారు. మొత్తం 15 బూత్ లలో దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి స్లిప్ లు తీసుకుని వెళ్లి వాళ్లే ఓటు వేశారని ఆరోపించారు.
