ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది…నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి: కేటీఆర్
ఓ బీఆర్ఎస్ కార్యకర్త కూతురి పెళ్లి పిలుపుపై కేటీఆర్ భావోద్వేగం
తండ్రి, అన్నయ్య లేని లోటు తీర్చాలంటూ యువతి అభ్యర్థన
గంభీరావుపేట మండలానికి చెందిన నవిత పంపిన ప్రత్యేక ఆహ్వానం
ఆడబిడ్డకు అండగా నిలవడం తన బాధ్యత అని స్పష్టం చేసిన కేటీఆర్
పార్టీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రత్యేకమైన వివాహ ఆహ్వానంపై భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి, అన్నయ్యను కోల్పోయిన ఓ యువతి, తన పెళ్లికి అండగా నిలవాలని కోరుతూ పంపిన పిలుపు తన మనసును కదిలించిందని ఆయన తెలిపారు. ఆ ఆడబిడ్డకు అన్నగా అండగా నిలవడం తన బాధ్యత అని ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ కరోనా మహమ్మారి సమయంలో మరణించారు. ఆ తర్వాత, ఆయన కుమారుడు ధ్యానబోయిన నరేష్ కూడా ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మరణానంతరం కూడా తన అవయవాలను జీవన్‌దాన్‌కు దానం చేసి నరేష్ ఆదర్శంగా నిలిచారు.ఇలా తండ్రి, అన్నయ్య ఇద్దరినీ కోల్పోయిన నర్సింలు కుమార్తె నవితకు వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా ఆమె కేటీఆర్‌కు పెళ్లి పత్రిక పంపుతూ ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేశారు. “నా వివాహానికి నాన్న, అన్నయ్య లేని లోటును మీరే తీర్చాలి” అని ఆమె కోరారు. ఈ ఆహ్వానం తనను తీవ్రంగా కదిలించిందని కేటీఆర్ పేర్కొన్నారు.”ఇది కేవలం ఆహ్వానం కాదు, నా మీద ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై పెట్టుకున్న ఆశ. ఆ ఆడబిడ్డ కోరికను గౌరవించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను” అని కేటీఆర్ అన్నారు. ప్రజలతో తమకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని, ఇలాంటి సంఘటనలు తామంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని గుర్తుచేస్తాయని ఆయన వివరించారు.నవిత, సంజయ్ దంపతుల కొత్త జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
